మద్రాస్ ఐఐటీలో ఆత్మహత్యల కలకలం!... ఒకే రోజు ఇద్దరు మహిళల సూసైడ్!
తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక మద్రాస్ ఐఐటీలో నిన్న ఆత్మహత్యల కలకలం రేగింది. ఒకే రోజు వర్సిటీ ప్రాంగణంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరు ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్య కాగా, మరొకరు వర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తున్న పరిశోధక విద్యార్థిని కావడం గమనార్హం. వర్సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో గంటల వ్యవధిలో వెలుగుచూసిన ఈ రెండు ఘటనలు అక్కడ భయానక వాతావరణానికి తెర తీశాయి.
వివరాల్లోకెళితే... వర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గణేశన్ సతీమణి విజయలక్ష్మీ (47) వర్సిటీలోని వారి క్వార్టర్ లో ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. ఈ ఘటనతో గణేశన్ కుటుంబ తీవ్ర విచారంలో మునిగిపోగా... వర్సిటీలో విషాదకర వాతావరణం చోటుచేసుకుంది.
ఇదిలా ఉండగానే ఈ ఘటన వెలుగుచూసిన కొద్ది గంటల్లోనే పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తున్న మహేశ్వరి (34) అనే మహిళ కూడా తానుంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయింది. వరుసగా ఒకే రోజు ఇద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలతో వర్సిటీ వణికిపోయింది. ఈ హత్యలకు కారణం తెలియరాకున్నా... గంటల వ్యవధిలో ఇద్దరూ ఒకే రీతిన ఆత్మహత్యకు పాల్పడటంతో అక్కడ కలకలం రేగింది. పెళ్లైన మహేశ్వరికి ఆరేళ్ల కొడుకున్నా... వర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ కోర్సు చేస్తోంది. ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న కారణాలను వెలికి తీసేందుకు కొట్టూర్ పురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.